మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సీనియర్ నటి విజయశాంతిని తీసుకోవాలని అనుకున్నారు, కానీ ఏమైందో ఏమో కానీ, రాత్రికి రాత్రే అనూహ్య మార్పు జరిగి ఆమె స్థానంలో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో చిరంజీవి తో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులపై హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురిగా నటిస్తోంది. కేవలం మెగాస్టార్ పైనే కాకుండా కథలోని ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండేలా అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ తనదైన మాస్ బీజీఎం, పవర్‌ఫుల్ సాంగ్స్‌తో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే, టాలీవుడ్‌లో ఇదో సెన్సేషన్ అవుతుంది. చిరంజీవి, రమ్యకృష్ణ చివరిసారిగా 1999లో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు, అంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు మళ్లీ వెండితెరపై కలిసి కనిపించబోతున్నారు. ఇక వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మళ్లీ చూసేందుకు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు చూస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
చిరంజీవి సినిమాలో ఇలా ఆఖరి నిమిషంలో హీరోయిన్ మారడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. అందులోనూ రమ్యకృష్ణ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మెగాస్టార్ – రమ్యకృష్ణ కాంబినేషన్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ కోసం జెన్ జీ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.







