AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం .. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్‌ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 23-26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు పడతాయన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు.

ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు.

ANN TOP 10