ప్రజలు నివసించే ప్రదేశాల్లో ప్రమాదకర గోడౌన్లు ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్.. నాంపల్లిలోని బజార్ ఘాట్ అగ్ని ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించిన ఆయన.. ఇది చాలా దురదృష్టకరం అన్నారు. కెమికల్ గోడౌన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అత్యంత జనాభా నివసించే ప్రాంతంలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఈ గోడౌన్ ఉండగా… దీపావళి బాణసంచా నిప్పురవ్వలు పడి.. అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ గోడౌన్ లేకపోయి ఉంటే, ఇది జరిగేది కాదన్నారు.
ఇలాంటి అక్రమ గోడౌన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి, ఇలాంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబీకులకు తగిన ఆర్థిక సాయం, పీఎం కేర్ ద్వారా అందించేలా తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతానన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించాలని కోరారు. సికింద్రాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్న ఆయన.. అక్రమ గోడౌన్లపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు.









