ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి , నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో వాన కురిసింది.
మరో వైపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.5 డిగ్రీలకు చేరాయి. హైదరాబాద్ నగరంలో 22.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 18-21 డిగ్రీల మధ్య ఉంటాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.









