మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి గ్లోబల్ మీడియా సర్కిల్స్ లో ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. బాహుబలి, RRR చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న, ఈసారి సూపర్ స్టార్ మహేశ్ ను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారు.
చివరి దశకి వచ్చిన షూటింగ్
ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’ లో పాల్గొన్న రాజమౌళి, ఇంటర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా అప్ డేట్స్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మేజర్ హైలైట్ అయిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ అంతా ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని వెల్లడించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఐమాక్స్ ఫార్మాట్‌లో
ప్రస్తుతం చిత్ర యూనిట్ వారణాసిలోని అత్యంత కీలకమైన భాగాలను పూర్తి చేసి, కథను ఒక లీడ్‌లోకి తీసుకువచ్చే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ సన్నివేశాలను మరియు కనెక్టింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తోంది. రాజమౌళి వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే నాలుగు నెలల్లో అంటే, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా టాకీ పార్ట్‌తో సహా టోటల్ షూటింగ్ మొత్తం పూర్తయిపోనుంది. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తుండటం విశేషం. స్క్రీన్ సైజ్ మారినా వీడియో క్వాలిటీ మరియు ఇమేజ్ ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేలా ఈ సరికొత్త టెక్నాలజీని వాడినట్లు, ప్రారంభంలో దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడినా ఆ తర్వాత పట్టు సాధించి వర్క్ స్పీడప్ చేశామని జక్కన్న వివరించారు.
2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
మరోవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించడం కూడా సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. ఇక రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
సినిమాలో ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ పాత్రను మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న సంగతి తెల్సిందే .ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ అడ్వెంచర్ రాబోయే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేసి లాంగ్ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల కోసం జక్కన్న భారీగా సమయాన్ని కేటాయించనున్నారన్న మాట.








