AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘బటన్లు నొక్కితే ఓట్లు పడవు’..!11 సీట్లకు పరిమితం చేసినా మారరా..? వైసీపీ తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్..!

విపక్ష వైసీపీపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికి కూడా ఇష్టానికి నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 వచ్చినా.. భాష విషయంలో వెనక్కి తగ్గం అన్న రీతిలో వైసీపీ నేతల ప్రవర్తన ఉంటోందని సెటైర్లు వేశారు. మీరు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి అంటూ చురకలు అంటించారు.

 

‘ఇప్పటికైనా బుద్ది వస్తే సంతోషం’

మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీల సమావేశంలో పాల్గొని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు భాషపై జ్ఞానోదయం కలిగిందా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పతం నానాజీ మాటలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు పవన్ చురకలు అంటించారు. వైసీపీకి ఇప్పటికైనా బుద్ది వస్తే సంతోషమన్నారు. వైపీసీ నేతలు తమను తిట్టకుండా ఉంటే.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి బలపడతామన్నారు. కాదు తిడతామంటే.. మిమ్మల్ని తిట్టి బలపడతామన్నారు. ఏదైనా జనసేన బలపడటం గ్యారంటీ అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

 

‘బటన్లు నొక్కితే ఓట్లు పడవు’

బటన్లు నొక్కామని చెబుతున్న వైసీపీకి పవన్ ఈ సందర్భంగా చురకలు అంటించారు. బటన్లు నొక్కితే ఓట్లు పడవంటూ సెటైర్లు వేశారు. బటన్లు నొక్కేశాం.. మీకు డబ్బులు వచ్చేశాయ్ అంటే ప్రజలు సైతం అంగీకరించన్నారు. 70 ఏళ్లలో రాని రోడ్లు ఇప్పుడు ఎలా వచ్చాయి? కనీసం రోడ్లు మంచిగా లేకపోతే ఎలా ప్రయాణిస్తాం? అని తాను వేయించిన రోడ్ల గురించి పవన్ ప్రస్తావించారు. అయితే వైసీపీతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదన్న పవన్.. ఆ పార్టీ విధానాలను ప్రశ్నిస్తే తన వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టలేదన్నారు. బటన్లు నొక్కితే ఓట్లు వచ్చేస్తాయని ఆ పార్టీ భావించిందన్నారు.

 

‘నన్ను తిట్టిన వాళ్లంతా కాపులే’

మరోవైపు కాపు సామాజిక వర్గంలో ఐక్యత గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల్లో ఐక్యత లేదన్న పవన్.. కేవలం గొడవల సమయంలోనే ఏకం అవుతారని చెప్పారు. ఎన్నికలప్పుడు విడిపోయి.. అవకాశాలు పోగొట్టుకుంటారని అభిప్రాయపడ్డారు. తనను ప్రధానంగా తిడుతున్న వారంతా కాపులే అన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. మరోవైపు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు గురించి మాట్లాడుతూ.. నేరానికి కులం ఉండదని అన్నారు. కులరాజకీయాలు సామాజిక విజయాన్ని ఇవ్వలేవన్నారు. వైసీపీ.. కులం, మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటోందని పవన్ విమర్శించారు.

ANN TOP 10