‘కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా.. నిండు మనస్సుతో మీ బిడ్డను ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి’. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 1.30 గంటలకు వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు బండి సంజయ్.
ఆ తరువాత బండి సంజయ్ మాట్లాడుతూ.. మీరు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధికి వేలాది కోట్లు తీసుకొస్తా. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తా. ఏ ఆరోపణలు లేకుండా నిజాయితీగా పనిచేస్తా. ఇప్పటి వరకు అన్ని పార్టీల అభ్యర్ధులకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు బండి సంజయ్.
మరోవైపు బండి సంజయ్ మంగళవారం నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ నగర్‌లోని 24వ డివిజన్‌తో పాటు కిసాన్ నగర్‌లోని 25వ డివిజన్‌లో తన పాదయాత్ర కొనసాగిస్తారు. అటు బీసీల ఆత్మగౌరవ సభ పేరుతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు బండి సంజయ్ హాజరుకానున్న నేపథ్యంలో కరీంనగర్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే పాదయాత్ర చేస్తారు. మరుసటి రోజు నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు డివిజన్లలో, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు మరో రెండు డివిజన్లలో పాదయాత్ర చేస్తారు.









