AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!

ఏపీ రాజధాని అమరావతిలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని ఉండవల్లి సెంటర్ లో రైతులు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఓ దశలో లేళ్ల అప్పిరెడ్డి కారును చుట్టుముట్టి.. ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారు.

 

రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. కొండవీటి వాగు నీళ్లను వారి పొలాల్లోకి వదిలి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఆధ్వర్యంలోని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు బాధితుల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. రైతుల ముసుగులోని టీడీపీ గుండాలు తమను అడ్డుకొని దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పోలీసులు సైతం తీవ్ర గాయాలయ్యాయని పేర్కొంటున్నారు. కాగా, ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో తుళ్లూరు డీఎస్పీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

 

ఇదిలా ఉంటే అమరావతి రైతుల వెర్షన్ ఇందుకు భిన్నంగా ఉంది. రాజధాని ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నాయకులతో.. రాజధాని పరిరక్షణ కమిటీని వైకాపా ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాజధాని ఏరియాలోని పెనుమాక రావడంతో ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తమ పాలనలో మూడు రాజధానుల పేరిట అమరావతిని నాశనం చేసిన వైకాపా నేతలకు అమరావతి గురించి మాట్లాడే అర్హతే లేదని రైతులు మండిపడుతున్నారు.

 

రాజధానిలో తమ నేతలపై జరిగిన దాడిని విపక్ష వైసీపీ ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించింది. రాజధాని ప్రాంత రైతుల కోరిక మేరకు వెళ్లిన వైసీపీ నేతలు, సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గుండాలు దాడి చేశారని ఆరోపించింది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పెనుమాక రైతులు ఉద్యమిస్తున్నట్లు తెలిపింది. వారికి భరోసా కల్పించేందుకు వెళ్లిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డుకున్న పోలీసులపై కూడా తిరగబడి రాళ్లు రువ్వారని పేర్కొంది. దాంతో తీవ్ర గాయలై ఓ పోలీసు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారంటూ దానికి సంబంధించిన వీడియోను వైసీపీ పంచుకుంది.

ANN TOP 10