సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్. కేసీఆర్ చేపట్టే ప్రతి పనికి మొదట వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ఆరంభిస్తారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల బీఆర్‌ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్, సిద్దిపేట అభ్యర్థి హరీశ్ రావు లు నామినేషన్ పత్రాలపై శనివారం దేవాలయంలోనే సంతకాలు చేయనున్నారు. తొలుత 9వ తేదీన దేవాలయానికి వస్తారని ప్రకటించినప్పటికీ ముందుగానే వస్తున్నారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం బుధవారం ప్రారంభమైన శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
–1985 నుంచి..
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కోనాయిపల్లి ఆలయం ఆయనకు సెంటిమెంట్ మారింది. అప్పటి నుంచి 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీకి ముందు ఆలయంలో పూజలు చేసిన తరువాతే నామినేషన్ వేసేవారు. అలాగే మంత్రి తన్నీరు హరీశ్ రావు సైతం నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి నామినేషన్ వేస్తున్నారు. హరీశ్ రావుకు సైతం సెంటిమెంట్ దేవాలయం ఇది.









