కొల్లాపూర్ (kollapur) నియోజకవర్గంలో కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని తక్షణమే బదిలీ చేయాలని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally krishna rao) ఎన్నికల సంఘాన్ని (Election Commission) కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన జూపల్లి ఈమేరకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొల్లాపూర్‌లో చాలా మంది పోలీసులు దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నారని, వారిని వెంటనే బదిలీ చేయాలని జూపల్లి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లే పోలీసులు, అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవన్నారు. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను వెంటనే బదిలీ చేయాలని కోరారు.









