– నేను కందిపప్పును.. ఆరోగ్యానికి మంచిది
– పదేళ్లలో కేసీఆర్ చేసింది శూన్యమే
– ఆయన అవినీతికి ప్రత్యక్ష నిదర్శనం కూలుతున్న ప్రాజెక్టులే..
– టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ గన్నేరు పప్పు లాంటి వారని, తింటే చస్తారని, ఆయనతో ఎప్పటికైనా రాష్ట్రానికి ముప్పేనని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు’’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. 2018లో తెలంగాణ సెంటిమెంట్‌ను నిద్రలేపి కేసీఆర్ రాజకీయంగా లాభం పొందారన్నారు. 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్‌కు అవకాశం దొరికిందని తెలిపారు. కానీ పదేళ్లలో కేసీఆర్ గుడ్ విల్ సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఈ ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తీరతారని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చెబుతామన్నారు. అలాగే మన రాష్ట్రం గురించి చెప్పాలంటే తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాకముందు అని చెప్పుకోవాలి అని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటోంది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అని అన్నారు. కాని రాష్ట్రం ఒక వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతోందని, అందుకే ప్రజల పక్షాన పోరాడుతున్నానని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కాని లబ్ధి పొందుతున్నది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని మండిపడ్డారు. దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకోలేకపోయామన్నారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడించి తీరతారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌రెడ్డి అన్నారు.









