AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్‌

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే వాటర్ బాటిళ్లు ఇస్తుండగా.. తాజా స్నాక్స్ బాక్స్ కూడా అందిస్తున్నారు. అంతకు ముందు అంతరాష్ట్ర బస్సుల్లో మాత్రమే స్నాక్స్ ఇవ్వగా.. తాజాగా ఏసీ బస్సుల్లోనూ స్నాక్స్ ఇస్తున్నారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రైవేట్‌ రవాణా వ్యవస్థకు దీటుగా మెరుగైన సేవలు అందించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బస్సుల్లో సొంత బ్రాండ్ జీవా వాటర్ బాటిల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ బస్సుల్లో స్నాక్స్‌ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అక్టోబరు 16 నుంచి ఆర్టీసీ పరిధిలో ఏసీ బస్సు సర్వీసుల్లో ప్రయాణికులకు మిల్లెట్‌ స్నాక్స్‌ పేరుతో స్నాక్స్‌ ప్యాకెట్‌ అందిస్తున్నారు. స్నాక్స్ ప్యాకెట్‌కు ఛార్జీలోనే అదనంగా రూ.30 కలిపి తీసుకుంటున్నారు. మిల్లెట్స్‌ చిక్కి, రస్క్‌, కారా, టిష్యూ పేపర్‌ బాక్స్‌లో ఉంటాయి. ప్రయాణికులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో దీనిని అమల్లోకి తెచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇక ఈ స్నాక్స్ ప్యాకెట్లను ప్రయాణికులకు అందించినందుకుగాను డ్రైవరుకు ఒక్కో ప్యాక్‌పై రూ.0.50 పైసలు చెల్లిస్తున్నారు. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ANN TOP 10