కోరి వచ్చిన భక్తులపాలిట కొంగుబంగారం, జిల్లా ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతున్న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లిలోని పోచమ్మ ఆలయంలో గంగనీళ్ల జాతర వైభవంగా కొనసాగింది. ప్రతి సంవత్సరం విజయదశమికి అడెల్లీ పోచమ్మ ఆలయంలో ఈ గంగనీళ్ళ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈయేడు కూడా అంతే వైభవంగా ఈ జాతర కొనసాగింది. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో అడెల్లి జనసంద్రంగా మారిపోయింది.
అయితే ఈ జాతర విశిష్టత ఏమిటంటే అమ్మవారి నగలను పవిత్ర గోదావరి నదికి తీసుకువెళ్ళి ఆ నదీ జలాలలో వాటిని శుద్ది చేసి తిరిగి తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించడం. దసరాకు రెండు రోజుల ముందు నుండే ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానేపలు గ్రామాలకు చెందిన భక్తులు ఆలయ సిబ్బంది, అర్చకుల సమక్షంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి నగలను ఓ పసుపు బట్టలో మూటకట్టి, ఆ మూటను నెత్తినపెట్టి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారి నగల మూటను నెత్తన పెట్టుకొని పాదయాత్రగా దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గోదావరి నదికి తీసుకువెళ్ళారు. గోదావరి జలాల్లో వాటిని శుద్ది చేసి మళ్లీ కాలినడకనే అడెల్లికి తిరుగుపయనమయ్యారు.
అమ్మవారి నగలతో సాగిన ఈ ఊరేగింపునకు దారిపొడవున భక్తులు హరతులు పట్టారు. భక్తులు అమ్మవారి నగల మూటను తాకేందుకు పోటీ పడ్డారు. అమ్మవారి నగల మూటను స్పృషిస్తే అంతా మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి నగలతో గోదావరి నదికి బయలుదేరి వెళ్ళిన భక్తులు తమ వెంట గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఆ నీటిని ఇళ్లలో, పంటపొలాల్లో చల్లితే మంచి జరుగుతుందని వారి నమ్మకం.
మరోవైపు అమ్మవారి నగల మూటతో సాగిన ఊరెగింపును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో బాలురుదీరారు. డప్పు చప్పుళ్లు.. భక్తుల నృత్యాలు.. శివసత్తుల పూనకాలతో ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. దారిపొడవున అమ్మవారి ఆభరణాలపై భక్తులు పసుపు, నీళ్ళు చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. శోభాయాత్ర ఆలయానికి చేరుకున్న అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు అమ్మవారి ఆభరణాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.