తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసు సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చేశాయి. ఇవి తొలి విడత బలగాలు కాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయి. రాచకొండ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ కేంద్ర బలగాలు పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతు నిర్వహించనున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహన్ తెలిపారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అవసరమైన ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అక్రమ నగదు తరలింపు వంటి నేరాలను అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నమని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా ఎలాంటి సమస్యలు అవకతవకులు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా భారీ భద్రత ఏర్పాటు చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపనుంది. గతంలో పది వేల కేంద్ర బలగాలు తెలంగాణ వ్యాప్తంగా భద్రత కింద ఉంటే.. ఈసారి దాన్ని రెట్టింపు చేస్తూ 20 కేంద్ర బలగాలను హోం శాఖ కేటాయించింది.









