అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగుడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 9లక్షల డబ్బును గుర్తించారు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కారు, బైక్‌ను సీజ్ చేశారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాహన తనిఖీలు విస్తృతుంగా జరుగుతున్నాయి. సరైన ఆధారాల్లేకుండా తరలిస్తున్న నగదు, బంగారంతోపాటు అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కారు సీటు కింద దాచిపెట్టి తరలిస్తున్న రూ.3.04 కోట్లు నగదును నల్లగొండ జిల్లా పోలీసులు సినీఫక్కీలో పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో టోల్‌గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు తప్పించుకుని అతివేగంగా మిర్యాలగూడ వైపు దూసుకెళ్లింది. ఆ కారును అడ్డుకునేందుకు ఈదలగూడ జంక్షన్ వద్ద యత్నించిన మిర్యాలగూడ పోలీసుల విఫలయ్యారు. అయితే, వాడపల్లి అంత ర్రాష్ట్ర సమీకృత చెక్‌పోస్టు దగ్గర పోలీసులు ఆ కారును పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా కారు ముందుభాగంలోని సీటు కింద గుట్టుగా దాచిన రూ.3.04కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న గుజరాత్‌కు చెందిన విపుల్‌కుమార్, అమర్‌సిన్హాజాను అదుపులోకి తీసుకున్నారు.
