తెలంగాణ రాష్టంలో బోగస్ రేషన్ కార్డులు తొలగించాలనే ఉద్దేశంతో చేపట్టిన రేషన్ ఈకేవైసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తెల్లరేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని రేషన్ దుకాణాలకు పరిగెత్తుతున్నారు. ఈ నెల చివరి వరకే గడువు ఉందని ప్రచారం జరగడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూకడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ కేవైసీపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రేషన్ దుకాణాలలో వేలిముద్రలు రావట్లేదని బయోమెట్రిక్ అప్డేట్ కోసం కొందరు ఆధార్ కేంద్రాలకు క్యూకడుతున్నారు.
ఆధార్ కేంద్రాల్లో నమోదు చేసుకున్న రోజు నుంచి 90 రోజులలోపు అప్డేట్ అవుతుంది. ఈ కేవైసీ చేసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాలలో బియ్యం తీసుకునే పేద కుటుంబాలు ఆధార్ కేంద్రాలు రేషన్ దుకాణాలు చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. రేషన్ ఈ కేవైసీపై సర్వత్వ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఈ కేవైసీ చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చాలామంది తెలంగాణ వాసులు దుబాయ్ ఇతర రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామన్నారు. చివరి తేదీని పోస్ట్ ఫోన్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వని కోరిందని పేర్కొన్నారు. కేవైసీకి ఇంకా టైం ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు









