తెలంగాణ(Telangana)లోని భువనగిరి నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు రావడంతో అప్పట్లో భువనగిరిలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మనసు మార్చుకున్న అనిల్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కుంభం అనిల్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు.
కాంగ్రెస్ కుటుంబంలో చిరు సమస్యలు సహజమని చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరారని అన్నారు. భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు.









