లిబియాలో జల ప్రళయం
తూర్పు ఆఫ్రికాలోని లిబియాలో ఇటీవలి జల ప్రళయం ఎంతటి విధ్వంసం రేపిందో అందరూ చూశారు. మొదట వంద మంది లోపే చనిపోయారనుకుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. గత వారం సముద్రంలోకి కొట్టుకెళ్లిన శవాలు ఇప్పటికీ తీరానికి కొట్టుకొస్తున్నాయంటేనే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లిబియాలోని తీర నగరం డేర్నా ఇప్పుడో శవాల దిబ్బ అంటే తప్పేం లేదు. అసలీ నగరం పావు వంతు భాగం కొట్టుకుపోయింది.
డేర్నాలో గత వారం జల ప్రళయం సంభవించినప్పుడు ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. అంటే ఏ తెల్లవారుజామునో వారిని విపత్తు ముంచేసింది. ఇక ఆ నగరంపై పడిన అల కూడా మామూలుది కాదు. 23 అడుగుల ఎత్తయిన అల అని చెబుతున్నారు. 23 అడుగులు అంటే.. దాదాపు రెండంతస్తుల భవనం అంత. ఒక ఉప్పెనలాగా మీదపడిన ఆ అలకు ఊరిలో పావు వుంతు కొట్టుకుపోయింది. జనం గాఢ నిద్రంలో ఉండడంతో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయారు. నిద్రలోనే సముద్రంలోకి కొట్టుకుపోయారు. వారంతా ప్రాణాలు కోల్పోవడంతో సముద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా తేలియాడుతున్నాయి.
లిబియాలో వరదలు తొలుత సోమవారం బయటకు వచ్చాయి. అప్పటివరకు మిగతా ప్రపంచానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే లిబియా ఇప్పుడు రెండు ముక్కలుగా ఉంది. ఇక డేర్నాలో రాకాసి అల 20,000 మంది ప్రాణాలను తీసిన విషయాన్ని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ) నిపుణులు వెల్లడించారు. కాగా, ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని పేర్కొన్నారు. మరికొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొంది. కమ్మేసిన బురద నీరు.. పెద్ద పెద్ద భవనాలను కుప్పకూల్చి ప్రజలను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లింది.