AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ రెండు బిల్లులు ప్రవేశపెట్టండి.. మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు

ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ కీలక లేఖలు రాశారు. చ‌ట్టస‌భ‌ల్లో బీసీలు, మ‌హిళల‌కు రిజ‌ర్వేష‌న్ల బిల్లులు ప్రవేశ‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ కేసీఆర్ లేఖ‌లు రాశారు. చ‌ట్టస‌భ‌ల్లో బీసీల‌కు, మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్లమెంట‌రీ పార్టీ తీర్మానం చేసింది. ఈ రెండు బిల్లుల‌ను పార్లమెంట్ ప్రత్యేక స‌మావేశాల్లో ప్రవేశ‌పెట్టాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న‌ సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈమేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ రెండు బిల్లులపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు గళాన్ని వినిపిస్తునే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభ, లోక్‌స‌భ‌ల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని సీఎం కేసీఆర్ సూచించారు.

తరతరాలుగా తమ వృత్తులను నిర్వర్తిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన వృత్తి కులాలైన బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలన్న విషయంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. ఉత్పత్తిలో భాగస్వాములవుతూ, సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న బీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని.. అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని భేటీలో వివరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10