వినాయక చవితి, నిమజ్జనంపై ఉన్న డౌట్స్ పై క్లారిటీ ఇచ్చింది గణేశ్ ఉత్సవ కమిటీ. ఈనెల 18న పండుగ, 28న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. దీంతో చవితి పండుగ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కీలక సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని 20 ప్రాంతాల్లో లక్ష మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే బల్దియా పరిధిలోని కార్పొరేటర్ల ద్వారా మరో 3 లక్షల 10 వేల విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలతో పాటు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంలో మొత్తం 74 కొలనులు ఏర్పాటు చేయడంతో పాటు, 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్స్, మరో 27 బేబీ పాండ్స్ అందుబాటులో ఉంచనున్నారు.
భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు సూచనల మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లకు కార్యాచరణ రూపొందించారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో డ్రైనేజీల నిర్వహణ, మ్యాన్ హోల్స్ మరమ్మతులు, తాగునీటి సరఫరా ఉంటుంది. 453 మంది డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 33 చెరువుల వద్ద 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతారు. ఇక నిమజ్జనం, మండపాలు, ఊరేగింపు సందర్భంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు.