AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ అధిష్టానం పక్కా ప్లాన్‌ ?

గజ్వేల్‌లో ఈటల..కామారెడ్డిలో విజయశాంతి
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగుతోంది. హ్యాట్రిక్‌ విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తుండగా.. అధికారం మాదేనంటూ బీజేపీ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కేసీఆర్‌ పోటీ చేసే నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ధీటైన అభ్యర్థుల్ని బరిలోకి దించుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌తో కలిసి నడిచిన ఈటల రాజేందర్‌, విజయశాంతిని వచ్చే ఎన్నికల్లో ఆయనపైకి పోటీ పెట్టేలా బీజేపీ పెద్దలు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను.. కామారెడ్డిలో విజయశాంతిని పోటీ చేయించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌.. అందరి కంటే ముందే 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు సార్లు గెలిచిన గజ్వేల్‌తో పాటు తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికే వచ్చిన లీకేజీలతో జరుగుతున్న ప్రచారం ప్రకారం గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌, కామారెడ్డిలో విజయశాంతిని బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరిన ఈటల కేసీఆర్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై తాను పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తానని విసిరిన సవాల్‌కు కట్టుబడి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా..? లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా వేచి చూడాలి. అదే విధంగా కేసీఆర్‌ పోటీ చేసే రెండో నియోజకవర్గమైన కామారెడ్డిలో బీజేపీ నుంచి విజయశాంతి పోటీ చేస్తారని సమాచారం. ఆమె కూడా కేసీఆర్‌ వెంట పనిచేసి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత దూరమయ్యారు. వీరిద్దరు కేసీఆర్‌పై పోటీ చేస్తే ఆసక్తిగా మారుతుందనే చర్చ ఉంది.

ANN TOP 10