ప్రియుడితో కలిసి వెళ్లిపోయి, పెళ్లి చేసుకోవాలని పథకం వేసిన ఓ యువతి, ఆ ప్రేమోన్మాదంలో తోడబుట్టిన అక్కనే దారుణంగా హత్య చేసింది. పెళ్లయ్యాక కలిసి బతికేందుకు అవసరాల కోసం ఇంట్లో ఉన్న 70 తులాల నగలు, రూ.1.2 లక్షల నగదు అపహరించాలనుకుంది. ప్రియుడితో కలిసి సొత్తు దొంగిలిస్తుండగా అక్క చూడటంతో తమ బండారం బయటపడుతుందని ఆందోళన చెందింది. ప్రియుడితో కలిసి అక్కను ముక్కు, మూతి బిగించి ఊపిరాకుండా చేసి చంపేసింది. ఇదంతా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీప్తి (22) హత్య గురించే! రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దీప్తి హత్య వెనుక మిస్టరీ ఎట్టకేలకు ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత వీడింది. దీప్తి సోదరి చందన, ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ కలిసి ఆమెను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జగిత్యాలలో ఎస్పీ భాస్కర్ కేసు వివరాలను వెల్లడించారు. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డికి దీప్తి, చందన కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. దీప్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. కోరుట్లలో ఇంటి నుంచే పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌లో చేరింది. అక్కడే చందనకు బీటెక్ చదువుతున్న ఉమర్ షేక్ సుల్తాన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బీటెక్ పూర్తయ్యాక చందన కోరుట్లలోని తన ఇంటి వద్దనే ఉంటోంది. ఉమర్ షేక్ తరుచూ కోరుట్లకు వచ్చి చందనను కలుసుకునేవాడు.
ఆగస్టు 19న కోరుట్లకు ఉమర్ షేక్ రాగా తనను పెళ్లి చేసుకోవాలంటూ చందన అతడిని కోరింది. ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని, బయటకు వెళ్లి వివాహం చేసుకుందామని అతడికి చెప్పింది. దీనికి ఉమర్ సరేనన్నా.. పెళ్లి చేసుకుంటే, కలిసి బతికేందుకు మంచి ఉద్యోగంతో పాటు డబ్బూ అవసరం అని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులకు వాట్సాప్ కాల్ చేసి చందనతో మాట్లాడించాడు. 2రోజుల తర్వాత చందన మరోసారి ఉమర్‌తో మాట్లాడి తమ ఇంట్లో పెద్దమొత్తంలో బంగారంతోపాటు డబ్బులున్నాయని చెప్పింది. ఆగస్టు 28న తన తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళుతున్నారని, ఇంటి వద్ద అక్క ఒక్కత్తే ఉంటుందని, ఎలాగైనా ఇంటి నుంచి తననుతీసుకవెళ్లాలని కోరింది. ఆమె చెప్పినట్లుగానే 28న ఉదయం ఉమర్ హైదరాబాద్ నుంచితన కారులో కోరుట్లకు చేరుకున్నాడు. పథకం ప్రకారం ఆ రోజు రాత్రి దీప్తికి వోడ్కా తాగించింది. రాత్రి 2గంటల సమయంలో ఇంటికి రావాలంటూ చందన తన ప్రియుడికి మెసేజ్ పెట్టింది. ఇంట్లోకి వచ్చిన ఉమర్, చందనతో కలిసి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును బ్యాగులో సర్దుతుండగా అలికిడి దీప్తికి మెలకువ వచ్చింది. చందన, ఉమర్‌ను చూసి గట్టిగా అరిచింది.
భయపడిపోయిన చందన, ఉమర్… దీప్తి మూతి, ముక్కుకు స్కార్ఫ్ కట్టి టేపు చుట్టారు. ఊపిరాడక దీప్తి మృతి చెందింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక స్కార్ఫ్, టేపు తొలగించి.. అతిగా మద్యం సేవించడం వల్లే మృతిచెందినట్లుగా అందరూ అనుకోవాలని, ఆమె పక్కన మద్యం సీసాలు ఉంచారు. అనంతరం 70 తులాల బంగారం, రూ.1.2 లక్షలు తీసుకొని ఇంట్లోంచి పారిపోయారు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన దీప్తి తల్లిదండ్రులు, అదే రోజు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, చందన, ఉమర్‌ను మహారాష్ట్ర వైపు పారిపోతుండగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్-బాల్కొండ రహదారిలో అడ్డుకొని అరెస్టు చేశారు. విచారణలో దీప్తిని తామే హత్య చేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు. ఉమర్, చందనతోపాటు వీరు పారిపోయేందుకు సహకరించిన ఉమర్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్, సోదరి షేక్ ఆసియా ఫాతిమా, బంధువు హఫీజ్‌పై కేసు నమోదు చేశారు. చందన, ఉమర్ షేక్ నుంచి 70 తులాల బంగారం, రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు.









