రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.
ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.









