చందమామపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 మిషన్.. ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల పరిశీలన కోసం విక్రమ్ ల్యాండర్‌కు అమర్చి పంపిన ChaSTE (Chandra’s Surface Thermophysical Experiment) పేలోడ్ ఈ పరిశీలన చేస్తున్నది. ఈ క్రమంలో ChaSTE పేలోడ్ తొలి పరిశీలనకు సంబంధించిన గ్రాఫ్‌ను ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) లో షేర్ చేసింది. ఇస్రో పంపిన ఆ గ్రాఫ్ ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు, పైకి వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో ఉష్ణోగ్రతల్లో మార్పులను ఇస్రో గ్రాఫ్ సూచిస్తున్నది. ఒక మాపనాన్ని లోతుకు పంపి చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించిన ఉష్ణోగ్రత వివరాలను పరిశీలించడం ఇదే తొలిసారని, ఇంకా సమగ్ర పరిశీలన కొనసాగుతున్నదని ఇస్రో తెలిపింది.









