AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల కోసమే కేసీఆర్‌ జిమ్మిక్కులు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆపై గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలన్నారు. ‘‘అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్.. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ. ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నాలుగేళ్లలో రైతులపై పడ్డ వడ్డీని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఆ లెక్కన ఇప్పుడు చేస్తోన్న రుణమాఫీ సరిపోదన్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తోంది రుణమాఫీనా? వడ్డీ మాఫీనా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెబుతున్నాడన్నారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు భూముల విక్రయానికి తెరలేపిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని సమీక్షిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని, తమ కమిట్మెంట్‌కు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ధామాషా పద్ధతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసునని చెప్పారు. ఎవరి వకాల్తాలు అవసరం లేదని, అలాగే ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. అలాగే దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ, మన్మోహన్ అని పేర్కొన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి, కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారన్నారు. నియంతలకంటే నికృష్టాంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ANN TOP 10