AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమలలో మరో 5 చిరుతల సంచారం

తిరుమలలో వన్యప్రాణులు కొద్దిరోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. నడకదారిలో జంతువుల సంచారం ఎక్కువైపోతుండటంతో ఎక్కడ దాడి చేస్తాయోనని శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజులుగా తరచుగా భక్తులకు ఏదోక జంతువు కనిపిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. నిన్న కూడా మెట్ల మార్గంలో ఒక చిరుత కలకలం రేపగా.. ఇవాళ శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి కనిపించింది.

నడకదారిలో రోజూ జంతు సంచారం కనిపిస్తుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నడకమార్గం సమీపంలోనే మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రూప్ కెమెరాల్లో గుర్తించామని, వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, పట్టుబడ్డ చిరుతలను ఎస్వీ జూపార్క్‌కు తరలించనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం పట్టుబడ్డ ఆడ చిరుతకు నాలుగేళ్లు అని, బాలికపై దాడి చేసిన చిరుత ఇదేనా..? కాదా..? అనేది పరిశీలిస్తామన్నారు. నేడు జరగనున్న టీటీడీ హైలెవల్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు నేటి నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్‌లో బైక్‌లకు అనుమతి లేదని తెలిపారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆలయ పరిసరాలకు వన్యప్రాణులు అలవాటుపడ్డాయి. దీంతో తరచూ నడకమార్గాలు, ఘాట్ రోడ్డులలో కనిపిస్తున్నాయి. వన్యప్రాణులను గుర్తించి ట్రాప్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. నడకమార్గంలో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, బంధించిన మృగాలను జూపార్క‌కు తరలించడం లేదా సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ANN TOP 10