AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ అదిరే ఆఫర్లు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్ ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. పిల్లలకు టి-24 టికెట్ ను రూ.50కే అందించనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాత్రమే ఒక్క రోజు ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్ ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50 కి ఇవ్వనుంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్ లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది ఆర్టీసీ.

వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆగస్టు 15 శుభ దినాన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రాయితీలను ప్రకటించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందన్నారు. 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కి తమ ఆధార్ కార్డును చూపించాలన్నారు. అలాగే.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారన్నారు. పెద్ద ఎత్తున పెద్దలు, పిల్లలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారన్నారు.

ANN TOP 10