కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ ఏ పార్టీలో చేరబోయేది క్లారిటీ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బీజేపీ కాపాడుతోందని అన్నారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ పెద్దలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చాక సంతృప్తిగా ఉన్నారో లేదో బండి సంజయ్‌కే తెలియాలని ఏ.చంద్రశేఖర్ అన్నారు. రాజకీయంగా తెలంగాణ బీజేపీకి ప్రణాళికలు లేవని, కష్టపడే నాయకులకు బీజేపీలో చోటు లేదని అన్నారు. బీజేపీలో చేరిన అనేక మంది తెలంగాణ ఉద్యమ నేతలు భంగపాటుకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.









