నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఒక్క వాహనం ఆగినా, ఏదైనా ప్రమాదం జరిగినా భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుంది. ముఖ్యంగా వారాంతాల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఒకదాని వెనకాల మరొటి నాలుగు వాహనాలు వరుసగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. దీంతో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్ బ్రేకు వేయడం వల్ల యాక్సికెంట్ జరిగిందని అంటున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్ఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. భారీగా స్తంభించిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. చాలా సేపు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.









