AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోకర్లను లీడర్లుగా చేస్తే చూడాల్సింది సర్కస్సే

జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూడాల్సింది వారి సర్కస్‌ను మాత్రమేనని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ‘దేహానికి గాయాలైతే మౌనంగా ఉన్నా కొద్ది కాలం తర్వాత మానిపోతాయి. దేశానికి తగులుతున్న గాయాలపై మౌనంగా ఉంటే అది రాచపుండు మాదిరిగా ప్రమాదకరంగా మారి కబళించివేస్తుంది. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సమూహ ఏర్పడటం మంచి పరిణామం. అందరూ మేల్కొని దేశాన్ని రక్షించుకోవాలి’ అని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సమాజం నేడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. కేవలం ప్రతిభ ఉంటేనే రచయితలు, కవులు కాలేరు. చంద్రుడు, పూలు, నక్షత్రాలు, ప్రకృతి మీద కవితలు రాయొచ్చు. కానీ, మనం వెళ్తున్న దారిలో రక్తం కనిపిస్తే దానిపైనా రాయాల్సిన బాధ్యత కూడా కవులపై ఉంది. వాటిని డాక్యుమెంట్‌ చేయాల్సిన అవసర మూ ఉంది’ అని నొక్కి చెప్పారు. ‘ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో నువ్వా? నేనా? అనే డిబేట్‌ కాంపిటేషన్‌ నడిచింది. అందులో రాజకీయం తప్ప వేరేదేం లేదు. వంద రోజులుగా మణిపూర్‌ మండిపోతున్నా మాట్లాడిందేం లేదు. మణిపూర్‌ గురించి ప్రస్తావిస్తే బెంగాల్‌, హర్యానా అంటూ అసలు విషయాన్ని దారిమళ్లించారు. హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టారు. సమావేశాల్లో పెద్దగా చెప్పుకోవడానికేం లేదు’ అని చెప్పారు. దేశంలో రైళ్లను ప్రారంభించుకుంటూ పోతున్న స్టేషన్‌ మాస్టర్‌ను మణిపూర్‌ వెళ్లే రైలు ఏ సమయానికి వస్తుందని అడిగితే సమాధానమే లేదన్నారు.

ANN TOP 10