ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కేంద్రం అడ్డుకోలేకపోతుందని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ సర్కార్‌కు అన్నీ తెలిసినా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారిందన్నారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్తానంలో ప్రజల మేలు కోసం, ప్రజల అభీష్టం మేరకే ఇన్నా్ళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించి తెలంగాణకు న్యాయం చేస్తాదని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. బీజేపీ, తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ఆరోపణలు వస్తున్నాయని.. అందువల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు చంద్రశేఖర్ దూరంగా ఉంటున్నారు.
బీజేపీకి గుడ్‌బై చెప్పిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిసింది. ఇప్పటికే హస్తం పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో చేవెళ్ల లేదా జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్‌ను బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.









