హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీపై కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ పై కారు డ్రైవర్ రాజేశ్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది. డ్రైవర్ రాజేశ్ కు గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ముగ్గురికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. కాగా, ప్రమాదంతో కేబుల్ బ్రిడ్జీ నుంచి మైండ్ స్పేస్ వైపు కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.









