తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు బలపడటంతో తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పశ్చిమం నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆగస్టు 5న కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.









