పోలీసులా బీఆర్ఎస్ కార్యకర్తలా….
అక్రమ కేసులపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
ఉద్రిక్తంగా మారిన ఆదిలాబాద్
నినాదాలతో దద్దరిల్లిన పోలీసుస్టేషన్ పరిసరాలు
శ్రేణులకు అండగా నిలిచిన కంది శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రూరల్ పోలీసుస్టేషన్ ను ముట్టడించి నినాదాలతో హోరెత్తించారు. గత కొంత కాలంగా రూరల్ పోలీసులు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసు స్టేషన్ కు పిలిపించి గంటల కొద్దీ పడిగాపులు కాయిస్తున్నారు. దీంతో విసిగి వేసారిపోయిన కార్యకర్తలు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్ ను ముట్టడించి ఆందోళనకు దిగారు. అక్రమ కేసులను ఎత్తి వేయాలి, పోలీస్ జులం నశించాలంటూ నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి.









