తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు గాను.. మూడింటికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును తిరస్కరించారు. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి ప్రభుత్వానికి పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు – బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను. బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం కావాలని నన్ను బాదనాం చేస్తే నేను బాధ్యురాలని కాను. నేను రాజకీయమైన యాక్టింగ్ చేయడం లేదు.. నేను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం’’ అంటూ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు.









