AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీ వర్షాల ఎఫెక్ట్.. ఓఆర్ఆర్ 2, 7 ఎగ్జిట్ పాయింట్లు మూసివేత

అసాధారణ వర్షాల వల్ల రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై 2,7 ఎగ్జిట్ పాయింట్లను మూసివేసినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు. ఎదులనాగులపల్లి వద్ద గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు వెళ్లే ఎగ్జిట్‌ నెం. 2, శామీర్‌పేట సమీపంలోని ఎగ్జిట్‌ నెం. 7 రెండూ మూసివేశారు. గత పది రోజులుగా పడుతున్న వానలకు రోడ్లు పాడైపోవడం, గుంతలు ఏర్పడటం, భారీగా నీళ్లు నిలిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మూసివేస్తున్నట్లు చెప్పారు. నీళ్లను బయటకు పంపిన తర్వాత తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఓఆర్ఆర్ నిడివి ఇరువైపులా కలిపి 316 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోటర్లు మినహా మిగతాది పూర్తిగా వర్షాలకు ధ్వంసమైంది. గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓఆర్ఆర్‌పై తరచూ లక్ష వరకు వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల రోడ్డుపై ఒత్తిడి పడి తారు తేలిచిపోతుంది. భారీ వాహనాలు 3,4 లైన్లలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ లైన్లలోని రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో భారీ వాహనాలు కార్లు వెళ్లే 1,2 లైన్లలోకి వస్తున్నాయి. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని వాహనదారులు చెబుతున్నారు. 3,4 లైన్లలో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉండగా.. 1,2 లైన్లలో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

భారీ వాహనాలు 1,2 లైన్లలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. కానీ భారీ వాహనాలు 1,2 లైన్లలోకి వస్తుండటంతో కార్లలో వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళనకు గురవుతున్నారు. 3,4 లైన్లలోని రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, దాని వల్ల 1,2 లైన్లలోకి ఆ వాహనాలు రావాలని చెబుతున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడుతుండటంతో రోడ్లకు మరమ్మత్తులు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశముంది.

ANN TOP 10