బహిరంగ లేఖలో రేవంత్ విమర్శలు
వర్షాలు, వరదలతో నాలుగు రోజులుగా హైదరాబాద్ ప్రజలు సతమతమవుతుంటే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సమస్యలను పరిష్కరించకుండా పారిపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘హైదరాబాద్ నగర ప్రజలు వరదలతో గోసపడుతుంటే బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. పట్టించుకోకుండా పత్తాలేకుండా పోయారు. ఫాం హౌస్‌లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేద తీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిం ది. హైదరాబాద్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రీకొడుకులు నగరాన్ని నరక కూపంగా మార్చారు’’ అని విమర్శించారు.
గడిచిన 9 ఏళ్లలో నగరంలో సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్నీ జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్‌నగర్ దాకా ట్రాఫిక్ జామ్(Traffic jam)లు ఎందుకు నిత్యకృత్యంగా మారతాయని ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోందని దుయ్యబట్టారు. ఫ్లై ఓవర్ల కింద అండ ర్ పాస్‌ల్లో నీళ్లు నిండిపోయి వాహనా లు వెళ్లలేక జనాలు ఇబ్బంది పడుతుం టే స్ర్టాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా డొల్లేనని తేలిపోయిందని విమర్శించారు. గ్రేటర్ పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారం భూములు, చెరువులను కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం లేకుండా పోయిందని, వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.









