ఎగువన కురిసిన భారీవర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో రామక్షేంత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో పరివాహక ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరవున్నారు. బుధవారం రాత్రి 12గం.లకు భద్రాచలం వద్ద 48.8అడుగులున్న గోదావరి నీటిమట్టం గురువారం తెల్లవారుజామున 3గంటలకు 50అడుగులు, ఉదయం 6గంటలకు 50.3, 8 గంటలకు 50.5 అడుగులకు చేరుకొని కొంతసేపు నిలకడగా ఉంది. అనంతరం స్వల్పంగా తగ్గుతూ ఉదయం 10గంటలకు 50.4 అడుగులకు చేరి తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది.
గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగి శుక్రవారం తుది ప్రమాద హెచ్చరిక(53అడుగు)ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి నదీ పరివాహాక ప్రాంతంలో వర్షాలు పడితే వాటి రీడింగ్‌ల ఆధారంగా ఎన్ని క్యూసెక్కుల నీరు భద్రాద్రికి రానుంది అనేది పూర్తిస్థాయిలో అంచనా వేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి వరద నేపథ్యంలో భద్రాచలం నుంచి ఏపీలోని కూనవరం, కుక్కునూరు మండలాలకు, భద్రాచలం నుంచి వెంకటాపురం వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా భద్రాచ లం డిపోనుంచి 20 సర్వీసులు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతుండగా.. త ద్వారా రూ.8లక్షల వరకు ఆదాయం కోల్పోవలసి వచ్చిందని తెలుస్తోంది.
గోదావరి వరదకు భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద ఉన్న దేవస్థానం కల్యాణకట్ట కిందిభాగం నీట మునిగింది. అలాగే అశోకనగర్ కొత్తకాలనీలోని సుమారు 20ఇళ్లల్లోకి బ్యాక్ వాటర్ చేరింది. అయితే ముందస్తుగానే ఆ కాల నీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ఇబ్బందులు తప్పాయి. అలాగే భద్రాద్రి రామాలయ పరిసరాలు, నిత్యన్నదాన సత్రం లోపలిభాగం నీరు చేరగా.. స్లూయి్‌సల వద్ద మోటార్లతో నీటిని తోడుతున్నారు.









