యాదాద్రి భువనగిరి:యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీ స్వామి, అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ గావించి స్వాతినక్షత్ర పూజలను గావించారు.
స్వామివారికి ప్రత్యేక పూజ అయిన శతఘటాభిషేక పూజను ఆలయ ముఖమండపంలో ఘనంగా నిర్వహించారు. స్వాతి నక్షత్ర పర్వదినం పురస్కరించుకొని భక్తులు, స్థానికులు తెల్లవారుజాము నుంచే యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేసి భక్తిశ్రద్ధలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి నామస్మరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పా ల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.









