మరో రెండు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిస్తుందని కుటుంబ సభ్యులు సంతోషంగా ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. పురుగులు మందుతాగి నిండు గర్భిణి అశ్విని (28) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల గ్రామంలో జరిగింది. కుటాగుళ్ల సచివాలయంలో 36వ వార్డు వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న అశ్విని తొమ్మిది నెలల నిండు గర్భిణి. ఈ నెల 27న ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. ఈలోపే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిందని వార్తను విన్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
భార్యా భర్తల మధ్య జరిగిన గొడవతో అశ్విని పుట్టింటికి వచ్చింది. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన రామచంద్ర,రాధమ్మ దంపతుల రెండో కుమార్తె అశ్వినికి మేనత్త కొడుకు విష్ణువర్ధన్ తో ఐదేళ్ల కిందట వివాహం చేశారు. కొద్దిరోజులు సవ్యంగా సాగిన వీరి కాపురం తరువాత తరచూ గొడవ పడేవారు. దగ్గరి బంధువులు కావడంతో సర్దిచెప్పేవారు. ఆమెకు రెండేళ్ల కొడుకు ఉండగా ఇప్పుడు అశ్విని తొమ్మిదో నెల గర్భిణి. ఆమె వాలంటీరుగా పనిచేస్తుండగా ఆమె భర్త నల్లచెరువు విద్యుత్తు ఉప కేంద్రంలో పనిచేస్తున్నాడు. అల్లుడు విష్ణువర్ధన్ వేధింపులతోనే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని అశ్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.









