AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వనమా.. దారెటు చెప్పుమా?

కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దాదాపు 50ఏళ్ల వనమా రాజకీయ ప్రస్థానానికి చెక్‌ పడినట్టేనా? అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. వనమా అభిమానులు, బీఆర్‌ఎస్‌ కేడర్‌ నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయింది. మరోవైపు వనమాపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ వైపు జలగం వర్గీయులు సంబురాల్లో మునగ్గా.. మరోవైపు వనమా వెంకటేశ్వరరావు, ఆయన వర్గం వారు భవిష్యత కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి తన స్థిర, చర ఆస్తులు, నేరచరితపై సమర్పించిన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం అందించారన్న అభియోగాలతో హైకోర్టు వనమాపై అనర్హత వేటు వేయడంతో ఆయన రాజకీయ భవిష్యత ప్రశ్నార్థకంగా మారింది.

2018 ఎన్నికల్లో వనమా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో స్థిర, చరాస్తులు, నేర చరితను సక్రమంగా వెల్లడించకుండా దాచిపెట్టారంటూ.. జలగం వెంకట్రావు 2019 జనవరి 25న హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జలగం వేసిన పిటిషనను డిస్మిస్‌ చేయాలన్సిందిగా ఎమ్మెల్యే వనమా కోర్టును అభ్యర్థించగా.. అందుకు అప్పటి జడ్జి అభిషేక్‌ రెడ్డి నిరాకరించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వెళ్లడంతో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2021 నవంబరు 8న విచారించి ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మళ్లీ హైకోర్టుకు వచ్చిన ఈ కేసుపై గతేడాది మార్చి రెండో వారం తర్వాత పలు దఫాలుగా విచారణ జరిగింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు అనర్హుడని, వాస్తవాలను దాచినందుకు గాను రూ.5లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెల్లడిండారు.

తగ్గేది లేదంటున్న వనమా..
ఏదేమైనా తాను తగ్గేది లేదని, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లి.. రెండుమూడు రోజుల్లో తన అనర్హత వేటుపై స్టే తీసుకొస్తానని వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ విషయంలో అభిమానులు, పార్టీ కేడర్‌, నియోజకవర్గ ప్రజలు గందరగోళంలో పడొద్దన్నారు. మంగళవారం తీర్పు వెలువడిన తర్వాత ఆయన నివాసానికి వెళ్లిన వారితో వనమా మాట్లాడారు.

ANN TOP 10