మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారంనాడిక్కడ కలుసుకున్నారు. షిండే వెంట ఆయన భార్య లతా షిండే, తండ్రి సంభాజీ షిండే, కుమారుడు శ్రీకాంత్, కోడలు రుషాలి, మనుమడు రుద్రాక్ష్ ఉన్నారు. ప్రధానమంత్రిని తాను, తన కుటుంబ సభ్యులు కలిశామని, ఆయన తమ పట్ల ఎంతో ఆప్యాయత చూపించారని సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
ప్రధాని తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంభాషణల సమయంలోనే మహారాష్ట్రలో వర్షాల పరిస్థితి, రాయ్‌గఢ్ ఘటన, ముంబైలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై చర్చించామని చెప్పారు. ప్రజలకు నివాసగృహాలు కల్పించే విషయంలో ప్రధాని ఎంతో ఆసక్తి చూపించనట్టు తెలిపారు. షిండే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కూడా ఆయన నివాసంలో కలుసుకోనున్నారు.









