న్యూఢిల్లీ: క్రూరత్వం పట్ల మౌనం వహించడం సహించరాని నేరమని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మణిపూర్ హింసపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపూర్ణ మౌనం పాటిస్తూ వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
మన తోటి గిరిజన సోదరులు, సోదరీమణుల పట్ల ఇంతహేయంగా, అనాగరికంగా ప్రతర్తించడాన్ని మనం అడ్డుకోవాలని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. మణిపూర్ గాయం మానాలని, ఒకే జాతిగా అందుకు మనమంతా సాయపడాలని ఆయన తన రెండు పేజీల లేఖలో రాష్ట్రపతిని అర్థించారు. ఇందుకు రాష్ట్రపతి చొరవ తీసుకుని ఒక మార్గాన్ని కనుగొనాలని, బాధితులకు న్యాయం దక్కేలా చూడాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలు పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతిని అర్థించారు.









