చరిత్రలో కనీవినీ ఎరుగుని రీతిలో యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం అతలాకుతలం అవుతోంది. ఢిల్లీలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎర్రకోట, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, సచివాలయం, మంత్రుల ఇండ్లు, ఎర్రకోట, రాజ్‌ఘాట్.. ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్లు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు రోడ్లను అధికారులు మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచించారు. మంచినీటి శుద్ధి ప్లాంట్లను మూసివేయడంతో హస్తినలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యమునా నది ఇంకా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో వరద నీరు ఐటీఓ రోడ్డులోకి చేరాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించారు. ఇక యమునా బ్రిడ్జిపై నుంచి మెట్రో రైళ్ల వేగ పరిమితిని అధికారులు కుదించారు. గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్‌తో బ్రిడ్జిపై నుంచి రైళ్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 23,692 మందిని శురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 21,092 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. 1,022 మందిని నేషనల్ డిజాసర్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కి చెందిన 12 బృందాలు రక్షించాయని తెలిపింది.









