భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరి కొద్ది గంటల్లో ప్రయాణం మొదలు కానుంది. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ – 3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ పాడ్ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.
ఈ ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 ప్రయోగానికి అవసరమైన రాకెట్ మిడిల్ సెగ్మెంట్, బకెట్ ఫ్లేంజ్, గ్రౌండ్ అండ్ అంబిలికల్ ప్లేట్లను తాము సరఫరా చేశామని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) వెల్లడించింది.
ప్రయోగం కేంద్రం నుంచి బయలుదేరిన 217 సెకన్ల తర్వాత భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోతుంది. దాదాపు ఆరు వారాల పాటు ప్రయాణించి 3.86 లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుడ్ని చేరుకుంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23 లేదా 24 ల్యాండింగ్ ప్రక్రియ చేపడతారు. ల్యాండింగ్ కోసం ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఇస్రో ఎంచుకుంది. చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై సాఫీగా దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా… చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.









