ఎవరొస్తారో రండి.. నిరూపించండి.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన కామెంట్స్ రాష్ట్రంలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంతే ధీటుగా వారి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన కోమటిరెడ్డి.. విద్యుత్ సరఫరా తీరును అక్కడి ఆపరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ 12 నుంచి 13 గంటలకు మించి సరఫరా జరగటం లేదన్నారు. మధ్య మధ్యలో కరెంటు కోతలు మినహాయిస్తే.. 12 గంటల విద్యుతే రైతులకు అందుతుందన్నారు.
‘‘రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తా. నా సవాల్‌ను మంత్రి కేటీఆర్ స్వీకరించాలి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే సబ్ స్టేషన్ కు వెళ్లి అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్‌ఎస్ పార్టీకి సేవ చేస్తా. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని రుజువు చేస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తా. మూడు గంటలు కావాలా ? మూడు పంటల కావాలన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలి. ఒక్కొ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని.. తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. ఎవడోస్తారో రండి, కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారని చూపించండి అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారని కోమటిరెడ్డి వెకంట్ రెడ్డి వెల్లడిరచారు. రేపు పీసీసీతో కలిసి తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.









