AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూరలో రెండు టమాటాలు వేశాడని.. ఇంటి వెళ్లిపోయిన భార్య

ఎంతకూ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన భర్త
టమాటా ధరలు.. సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్కెట్‌లో కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతుండటంతో జనం జేబులకు చిల్లులు పెట్టడమే కాదు.. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది. కొన్ని చోట్ల భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. తాజాగా, తనకు చెప్పకుండా కూరలో రెండు టమాటాలు వేశాడని భర్తతో గొడవపడిన భార్య.. తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త లబోదిబోమంటూ తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో చోటుచేసుకుంది.

షాడోల్ జిల్లాకు చెందిన సంజీవ్ బర్మన్.. ఓ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. రెండు రోజుల కిందట దుకాణంలో కూర వండుతూ.. తన భార్యకు చెప్పకుండా రెండు టమాటాలు వేశాడు. అసలే ధరలు మండిపోతుంటే.. తనకు చెప్పుకుండా టమాటాలు ఎందుకు వేశావని భార్య నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, గొడవకు దారితీసింది. ఆవేశంతో ఆమె తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. ఆమె పుట్టింటి వారికి, బంధువులకు ఫోన్ చేసి భార్య గురించి వాకబు చేశాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. టమాటాల విషయంలో గొడవపడి.. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసుల వద్ద వాపోయాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆమె కోసం గాలింపు చేపట్టారు.

ANN TOP 10