AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఫైర్‌

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఫైర్‌ అవుతున్నారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చటం సరికాదని, తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై రియాక్షన్స్‌ వస్తున్నాయి.

మంత్రి గంగుల కమాలకర్‌ మాట్లాడుతూ తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ విమర్శించారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స తెలంగాణ రాకముందు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు. ఆయన అప్పుడు కూడా తెలంగాణ కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రము లో విద్యావ్యవస్థ మెరుగుపడింది. 297 గురుకులాలు మాత్రమే నాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. నాడు మంత్రిగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం . పది లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఏపీ లో 380 గురుకులాలే ఉన్నాయి. అవి కూడా పదోతరగతికి మాత్రమే పరిమితం చేశారు. బొత్స సత్యనారాయణ ఇవ్వన్నీ వినాలే… ఇష్టానుసారం మాట్లాడటం సరికాదంటూ’ విరుచుకుపడ్డారు.

ఇక TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంపై స్పందించి గంగుల.. ‘TSPSCలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే. తప్పు చేసినవారిని శిక్షిస్తున్నాం. కానీ ఏపీ లో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారు . కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలి. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ,APPSC మెంబర్లే వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. “ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా?., రాజధాని కూడా లేని రాష్ట్రం అది. బొత్స అలా మాట్లాడటం సరికాదు. గతంలో ఎపిపిఎస్సిలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలి. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు” అని పేర్కొన్నారు.

ANN TOP 10