డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క స్థానం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది.
2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడయ్యింది. 2018లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువరాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం.









