AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.. పొంగులేటి

కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం అని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌లో బానిసలా ఉండటం ఇష్టం లేకనే బయటకు వచ్చానని చెప్పారు. వెయ్యి పశువులను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి కూడా అలాగే మారనుందన్నారు. పొంగులేటి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.. బీఆర్‌ఎస్‌లో చేరాలని 2014 ఎన్నికల కౌంటింగ్‌ సమయంలోనే అడిగారు.

ముందు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఆ తర్వాత కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల ఇలా వరుసగా తమ పార్టీలో చేరాలంటూ నా చుట్టూ తిరిగారు. ముందు తిరస్కరించా. రెండేళ్ల మూడు నెలల తర్వాత ఆ పార్టీలో చేరా. వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు అధినేత జగన్‌కు చెబితే వద్దన్నారు. కష్టాలు ఉంటాయి.. దాన్ని అధిగమిస్తే.. భవిష్యత్‌ ఉంటుందన్నారు. అయినా బీఆర్‌ఎస్‌లో చేరాను. నేను ఏదో ఒప్పందంతో పార్టీ మారలేదు. ముందు నుంచి మాకు వ్యాపారాలున్నాయి. నాకు స్వార్థం ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి బయటకొచ్చే వాడిని కాదు.

నాతో పాటు వచ్చే ప్రజాప్రతినిధులకు తమ సమస్యలు చెప్పుకొనే వీలు కల్పించాలని, కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలన్న ఒప్పందంతోనే పార్టీలో చేరాను. బీఆర్‌ఎస్‌లో చేరాక నాలుగేళ్ల పాటు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఈ పరిస్థితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలందరూ అనుభవిస్తున్నదే. ఈ విషయాన్ని వారెవరూ బయటకు చెప్పడంలేదు. ఇది నేను కాదు.. రాష్ట్ర ప్రజలే కోరుకుంటున్నారు. ఇదే మా లక్ష్యం.

సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌ను కోరాను. ఆ సమయంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఉంది. అక్కడికి రమ్మని ఆయన చెప్పడంతో 20 మందితో కలిసి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక సీఎంను కలిసి మీతో ఏకాంతంగా మాట్లాడాలని అడిగా. ‘ఉంటావ్‌ కదా.. రేప్పొద్దున కలుద్దామ’ంటారు. ‘సంతోష్‌ రేపు ఉదయం పిలిపించు’ అంటారు. పొద్దున్నే రెడీ అయి సంతోష్‌కు ఫోన్‌ చేసి వాట్‌ టైమ్‌ అని అడిగితే.. ‘టాక్‌ టూ పెదనాన్న’ అంటారు. అలా నాలుగు రోజుల పాటు పెద్ద నరకం కనిపించింది. వెంట తీసుకువెళ్లిన వారి ముందు ఎంతో అవమానం అనిపించింది. అప్పటి నుంచే నాలో కసి పెరిగింది. పార్టీని వీడాలని, కేసీఆర్‌ను గద్దెదించడమే నా అంతిమ ఆశయంగా నిర్ణయించుకున్నా అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోంది
రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్‌ స్పీడ్‌గా పడిపోయింది. ఇప్పుడు ముందంజలో ఉన్న బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ స్లోగా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగు తోంది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ ఎన్నికల నాటికి ముందంజలో నిలుస్తుందన్నది మా అంచనా. బీఆర్‌ఎస్‌ను ఓడించి కల్వకుంట్ల కుటుంబానికి ఇంటి కి పంపడమే లక్ష్యంగా మా బృందం పనిచేస్తుందని పొంగులేటి అన్నారు.

ANN TOP 10